Monthly Archives: August 2023

A post about why you are enough


This is a story about why you are enough and why you do not need encouragement or inspiration to be yourself. This starts from childhood when you’re still not conditioned by everyone around you.

పిల్లలలో మనం మనోధైర్యాన్ని క్రుంగతీస్తాము. అలాగ కాకుండా వెనకనుంచి మనం పర్యవేక్షిస్తు వారిని వదిలివేస్తే ఎంతటి అద్భుతమైన సృష్టిస్తారు అని ఈ కథ చెపుతుంది.. మీరే చూడండి

ఇద్దరబ్బాయిలు. ఒకడు పదేళ్ల వాడు. ఇంకొకడు ఆరేళ్ల వాడు.

ఊరి బయట పొలం దగ్గర పరుగులు పెట్టి అడుకుంటున్నారు.

చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు. పెద్దోడు వాడికందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు.

ముందు పెద్ద బావి ఉంది. పెద్దోడు చూసుకోలేదు.

అందులో పడిపోయాడు. వాడికి ఈత రాదు. బావి చాలా లోతు.

చుట్టుపక్కల ఎవరూ లేదు. అరిచినా సాయానికి వచ్చేందుకు నరప్రాణి లేదు.

చిన్నోడికి ఒక తాడు కట్టిన బొక్కెన కనిపించింది. తాడును పట్టుకుని బొక్కెనను బావిలోకి విసిరాడు.

“అన్నా… దీన్ని పట్టుకో” అన్నాడు.

నీట మునిగి తేలుతూ కేకలేస్తున్న పెద్దవాడు తాడును పట్టుకున్నాడు.

చిన్నోడు తన శక్తినంతా కూడగట్టుకుని తాడును పైకి లాగడం మొదలు పెట్టాడు.

“అన్నా … భయపడకు… జాగ్రత్తగా పట్టుకో… పడిపోకుండా చూసుకో” అని అరిచాడు.

తాడు చివరను ఒక చెట్టుకి కట్టాడు. నెమ్మదిగా లాగుతూనే ఉన్నాడు. ఒక అరగంట పెనుగులాడిన తరువాత పెద్దోడు సురక్షితంగా బయటకి వచ్చాడు.

ఆ తరువాత పెద్దోడు చిన్నోడు ఊళ్లోకి పరుగెత్తారు. ఊళ్లో వాళ్లకి జరిగింది చెప్పారు. చిన్నోడు పెద్దోడిని ఎలా కాపాడాడో చెప్పారు.

ఊళ్లో ఎవరూ నమ్మలేదు. ఆరేళ్ల వాడేమిటి, పదేళ్ల వాడిని లాగడమేమిటి? అందునా బావి నుంచి లాగడమేమిటి? అసాధ్యం. వాడు చేయలేడని అన్నారు.

ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు.

సంగతి ఆ నోటా ఈ నోటా పాకింది.

దేవాలయం ముసలి పూజారిగారికి విషయం తెలిసింది.

“మీరు నమ్ముతారా పూజారి గారూ”

“నమ్ముతాను”

“ఎలా?”

“చిన్నోడు లాగి పెద్దోడిని బావి నుంచి బయటకి తీసి రక్షించాడు.”

“అదెలా సాధ్యం. అంత చిన్నోడు ఎలా చేయగలడు?”

“తనకి అంత బలం లేదన్న సంగతి, వాడు పెద్దోడిని బావినుంచి లాగలేడన్న సంగతి చిన్నోడికి తెలియదు. ఒరేయ్… నీకంత బలం లేదురా… నువ్వు చేయలేవురా… అది నీవల్ల సాధ్యం కాదురా…అని చెప్పేవారెవరూ ఆ పరిసరాల్లో లేరు. కాబట్టి వాడు చేయగలిగాడు. నీవల్ల కాదని చెప్పే వాళ్లుంటే వాడు ప్రయత్నించేవాడే కాదు. ఏడుస్తూ ఊళ్లోకి పరిగెత్తుకు వచ్చేవాడు. మనం బావి దగ్గరికి వెళ్లే సరికి పెద్దోడు శవమై తేలి ఉండేవాడు. “

ప్రశ్నవేసిన వాడు మాట్లాడలేకపోయాడు.

“నీవల్ల కాదు అని చెప్పేవాడు లేకుంటే మనిషి ఎంత పనైనా చేస్తాడు. అది బావైనా, బతుకైనా అంతే…” అన్నాడు పూజారిగారు.

Arise! Awake! and stop not until the goal is reached. — Swami Vivekananda

Source: A facebook group